టాలీవుడ్ వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సుకుమారి’ టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు ఐశ్వర్య ఆసక్తికరంగా స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాల్లో మీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అని అడగగా.. “మీ దగ్గర అనిల్ గారి నెంబర్ ఉంటే వెంటనే ఫోన్ చేసి అడుగుదాం” అంటూ సరదాగా నవ్వులు పూయించారు. బహుశా తనకోసం మరింత అద్భుతమైన పాత్రను డిజైన్ చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉండి ఉంటారని సరదాగా వ్యాఖ్యానించారు.
టాలీవుడ్‌లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, హిట్స్, అలాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 2019లో వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే మహిళా ప్రాధాన్య చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో మహిళా క్రికెటర్‌గా ఆమె చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో ‘సువర్ణ’ అనే ఒక సాదాసీదా మధ్యతరగతి గృహిణి పాత్రలో ఒదిగిపోయి తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీలో కీలక పాత్రలో నటించింది. గతేడాది విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో భాగ్యలక్ష్మిగా నటించి, తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను దక్కించుకుంది.